Thursday, August 21, 2008

చిరు గాలి


సన్నటి గాలి తెమ్మెర మెల్లగా
నా మేనును తాకుతూ ...
నా చెవిలో ఏదో గుస గుసలాడుతోంది
సన్న జాజి తీగతో ఆటలాడుతూ,
దాన్ని మాటి మాటికీ కదిలిస్తూ ..
మొగ్గలను నవ్విస్తోంది .
అబ్బబ్బ ఎంత అల్లరో !
చిలిపి గాలి చిన్నగా నా చెంతకు చేరి
నా దారిని ఏమార్చేస్తోంది .
ఏవో తెలియని ఉహల్ని నాలో రేపి
నన్ను ఒంటరిగావదిలెళ్ళిపోయింది..

ప్రేమా- జ్ఞాపకం


మనసు అనే తెల్లని గోడ మీద ప్రేమ అనే పటాన్ని జ్ఞాపకాల మేకులతో తగిలించా ఎవ్వరు చూడలేరు దాన్ని నేను తప్ప పటం చిరిగినా గోడ కూలిన మేకులు మిగిలిపోతాయి గుచ్చుకుంటూ.

గుర్తొస్తావు


ఏమెరుగని స్వచ్చతను చుస్తే నువ్వు గుర్తొస్తావు
అందరికి సమానంగా పంచే వెన్నెల ను చుస్తే నువ్వు గుర్తొస్తావు
మౌనముని బుద్ధుడి వికసిత నేత్రాలు చుస్తే నువ్వు గుర్తొస్తావు
హటాత్తుగా నా మనసులో అలజడి రేకేత్తిస్తావు
పువ్వులోంచి జారిపడ్డ పుప్పొడిని చూసినప్పుడు నువ్వు నీ నవ్వు గుర్తొస్తాయి
ఆకాశం లో నుంచి నా గుండెల్లోకి రాలిపడ్డ మంచు ముత్యనివై నీవు గుర్తొస్తావు .

Wednesday, August 20, 2008

నా సఖుడు చందమామ


మనసంతా తన కోసం తహ తహ తమకంతో ఉగిపోతున్నవేళ
కనురెప్పలు బరువెక్కినా, నా కళ్ళ వాకిళ్ళు తనకై తెరచి యెదురుచూస్తున్నవేళ
మధురూహల పరిమళాలు విరజల్లే విరజాజులు వరహంతో వెర్రెక్కుతున్నవేళ
మిల మిలల తారలన్నీ తళ తళా మెరుస్తూన్న వేళ
దిక్కులన్నీ అతని రాకకై చీకటి పరదాలు పరుస్తున్నవేళ
సంధ్యదేవి తెలతెల్లని వెన్నెల చీరకట్టి తనకై తపిస్తున్నవేళ
ఆకాశమంతా అతని రాజసం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నవేళ
కోటి కోరికల కలువలు మనసుల రెక్కలు విప్పి అతన్ని కొలుస్తున్నవేళ
చిరుగాలి చిరుచెమటలు చెరిపేసే వేళ
కొమ్మ కొమ్మను కీరవాణి చిగురించే వేళ
మత్తుల గమ్మత్తుల గువ్వలన్నీ గూళ్ళు చేరుకున్న వేళ
పుడమంతా తనకోసం దీపాల జిలుగులు వెలిగించుకున్న వేళ
తెల్లగా చల్లగా మెల్లగా కాంతుల వారకాంతలు తోడురాగా వస్తాడు
నా మామ శశికాంతుడు
నన్ను నిద్రపుచ్చంగా అలసిపోయిన నా మనసును
తినకుండా మారాము చేసే చంటి పిల్లల తాయిలంలా
కథలు కాణాచిలా వెండి వేల్పు
వలపు కలలకు మేలుకొల్పు.

Tuesday, August 19, 2008

భావమా నా భావమా


నా చిన్ని గుండెలో మాయని గాయాన్ని రేపి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తావు నీవు
ఏదో చెయ్యాలనే తపనని ఏమి చెయ్యలేని నిస్సహాయాతని వ్యక్తం చేయిస్తావు నీవు
నా ఆలోచనల బొమ్మలతో ఆటలాడేస్తావు
నీ వెల్లువలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తావు
నన్నో అక్షర సముద్రంలో పడేసి అందులోనుంచి మంచి ముత్యలనేరమంటావు
అందినట్టే అంది చిక్కకుండా చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ
నిలవకుండా జారిపొయే చిరుజల్లులా నన్నూరిస్తూ
చేజారిపోయిన నిన్ను నేను ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి
సేదతీర్చే సెలయేరులా ఉయ్యాలలో నాకు జోలపాడుతుంటావు
ఆఖరికి
నా చేతికి సగం అంది నవ్వుకుంటూ నన్ను వదిలి వెళ్ళిపోతావు.

అన్నీ ఆశలే నాకు


నాకైతే సెలయేరులా గల గలా పారుతూ నీ చేతుల్లోంచి జారిపొవాలని
చిరుగాలిలా నిన్ను చుట్టిపోవాలని
నెలవంకలా నవ్వుతూ నిన్నురించాలని
మంచులో తడిసిన మల్లెలా నీ విరహాల చిరుచెమటలు చిన్దించాలని
చుక్కలా మిల మిలా మెరుస్తూ నిన్నలరించాలని
వెన్నెల వెలుగులు నీ పై కురిపించాలని
జాబిల్లిలా నీ పై పడి మెరవాలని
చిట్టి చినుకులా నీ గుండెల్లో ఇంకి పోవాలని
పిల్ల తెమ్మెరలా నిన్ను తాకిపోవాలని
గడుసు కోయిలలా నీ చెవులకు సోకిపోవాలని
మిడిసిపడే కొంగరెక్కలలా నా పమిట చివరకు నీ గుండె అంచును ముడివేసిపోవాలానీ
నీ సంధ్యా వాకిలిలో చిన్ని ప్రమిదల వెలుగుల్లో మురిసిపోవాలని .....
అమ్మో అన్నీ ఆశలే చిలిపి ఊహలే....
ఇవన్నీ నా కళ్ళ వాకిళ్ళు దాటి నీ గుండె గదికి కబురులంపిస్తే .....
నీ చూపుల పిడి బాకుల నుంచి నీ నిట్టూర్పుల ఆవిరుల నుంచి నీ కంటి చివరుల అవధుల్లోంచి జారిపోగాలనా.... నిన్ను చేజార్చుకోగలనా........

పాపలు చిన్నారి బాబులు


నెల వెన్నెల ఎల కోయిలలు సిరి మువ్వల విరి జాజులు మురిపింపుల మైమరపింపుల పాపలు చిన్నారి బాబులు
అల్లరి సింహాలు తుంటరి గువ్వలు ఒంటరి కుందేళ్ళు పాపలు చిన్నారి బాబులు
చిరునవ్వుల పువ్వులు కవ్వింపుల కోపాలు ప్రశ్నల కెరటాలు పాపలు చిన్నారి బాబులు
అమ్మ నాన్నల యువరాజులు అమ్మమ్మ తాతయ్యల అధిరాజులు
ప్రేమ సామ్రాజ్యాల రాజాధిరాజులు పాపలు చిన్నారి బాబులు
ఉరుముల మేఘాల జడిపింపులు చినుకుల మెరుపుల గిలిగింతలు
వానల జడివానల పులకరింతలు పాపలు చిన్నారి బాబులు

దరహాసం

రెండు ఎర్ర గులాబీల మధ్యన ఎన్నో తెల్ల గులాబీ రేకులు అవి విచ్చుకుని గుచ్చుకున్నప్పుడల్లా
హృదయములో కోటి వసంతాలు మనసు మానస సరోవరాల్లో హంసల రెక్కల చప్పుళ్ళు
నయనాల నీహారికల్లో మిల మిలల తారలు చెంపల కెంపుల్లో చిన్న చిన్న మెరుపులు
ఓ దరహాసమా నీకు నా జోహార్లు.

నా నువ్వు నీ నేను




మూసుకున్న నా కనురెప్పల మాటున నీ పై ఇష్టం
ముడుచుకున్న నా చేతుల్లో ఆ ఇష్టం నీ కు తెలియకూడదనే భయం
ఆగకుండా పరిగెత్తే నా గుండెలో అది నువ్వెక్కడ అయిష్టం అనుకునవేమోననే సంశయం
కళ్లు ఎత్తితే నా కనుల నిండా నువ్వే
గుప్పెళ్ళ నిండా నీ పై నా కలలే
గుండెల నిండా నీపైప్రేమే
చెప్పకుండా నువ్వెప్పుడయినా తెలుసుకోకపోతావా అని
కోటి ఆశల ఊహల పరవళ్ళ పరవశంతో
నేనెప్పుడూ నీ వంక మూసిన కనురెప్పల చివరల నుంచి
పెదవి వంపుల పలకరింపుల నుంచి
గొంతు వాకిలి దాటని గుండెలోంచి ఎదురుచూస్తూనే ఉంటాను
నా ప్రేమ ప్రియరాగాలను నీ మనసు చెవులకు వినిపిస్తూనే ఉంటాను
నీ హ్రుదయపు తలుపులు తెరిచే వెల్లువ కోసం వేచి చూస్తూనే ఉంటాను
ఎందుకంటే...
నాకు తెలుసు నా వెచ్చని ఊహల నీడలు నీ శ్వాసల్లోంచి నీ గుండెలోకి ఎపుడో చేరిపోయాయని
నా కనుసైగల కబురులు నీ కన్నుల్లో ఎపుడో నిండుకున్నాయని
నా ప్రియరాగానురాగాలు నీ కెపుడూ నిద్రపోని జోలలు పాడుతుంటాయని.