Monday, May 24, 2010

గుండెకి ఒక మువ్వై గుచ్చుకున్నట్టుంది


మెరిసేటి కిరణమై పొడిచిన నా పొద్దు 
వయ్యారి వాలుజడ లోంచి  ఒక పువ్వులా  రాలి
పాదాల పయినెక్కి అందె లా మ్రోగి 
కన్నుల దీపమై మెరిసిపోయినట్టుంది 
పెదవిపై ఒక నవ్వు విచ్చుకున్నట్టుంది 
గుండెకి ఒక మువ్వై గుచ్చుకున్నట్టుంది 
గువ్వలా ఒదిగిన ప్రేమ చిగురించినట్టుంది 
సాగేటి నదిలో తేలేటి తేటల తెప్పలా
మనసు ఉరకేలేస్తా ఉంది పరుగులేడతా ఉంది 
పడుతూ లేస్తూ 
నీదరికి నన్ను తరుముతా ఉంది 
గోదారి పాయలో వెలిగేటి వెన్నెలై
నిలుచున్ననా నువ్వు 
సరిగ్గా నీ పాదాల అంచుల ఇసుక తీరాన నీ నేను .

Monday, May 17, 2010

వెన్నెల వేట

అపుడెపుడో అరక్షణం క్రితం అలిగి వెళ్ళిపోయిన నువ్వు ఇక మరి రానే రావు 
నా కనుపాపలు  నీ స్వప్నాల పాపాయిలు జారిపోకుండా కాపలా కాస్తుంటాయి 
వెన్నెల్లో విరహిణిలా కిటికీ పక్కని సన్నజాజి తీగ జాలిగా నాకేసే చూస్తుంటుంది 
వెన్నెల వేయి చేతులతో వేవేల చలువ కిరణాల వాడి బాణాల్నినాకేసి గురిపెట్టి
గుండెలను చీలుస్తుంటుంది 
పరాగ్గా వీస్తున్న చల్లగాలి సయితం బగ్గు బగ్గున మండుతూ వెర్రి కేకలు వేసి నన్ను 
గిర గిర తిప్పి విసిరేస్తుంటుంది 
కొంటె మల్లెల దండ ముళ్ళ పళ్ళ నోళ్ళు తెరిచి నన్ను వెక్కిరిస్తుంది 
ఉన్నంత మేర ఆకాశము నేను ఒంటరిగా మిగిలిపోతాం 
అపుడెపుడో అరక్షణం క్రితం అలిగి వెళ్ళిపోయిన నువ్వు ఇక మరి రానే రావు

Wednesday, May 5, 2010

చినుకు -- చినుకు-- చినుకు


ఓ చినుకు రాలిపోయి ఓ చినుకు ఒలికిపోయి ఓ చినుకు కులికిపోయింది 
ఒక చోట పడ్డ ప్రౌడ చినుకు విత్తనానికి అన్నమై మొలకెత్తి పోయింది
ఒకే చోట పడ్డ చినుకుల దండ కాగితప్పడవల కాలవై పోయింది 
తల మీద పడ్డ చినుకుతొలకరై  అమ్మ స్పర్శలా ఆశీర్వదించింది 
తలపుల మీద పడ్డ చిలిపి చినుకు విరి బాణమై గుచ్చుకుంది
తనువెల్లా తడిపిన చినుకు మృదు భావనల కిరణమయిపోయింది
ఒక చోట లతలా వాళ్ళిద్దరి మధ్య అల్లుకుపోయింది 
ఒక చోట వెతలా రైతన్నల కన్నుపొడిచిపోయింది  
ఒక చోట వెల్లువై ముంచి పోయింది 
ఒక చోట  నింగి నేల మధ్య అంతరాన్ని కొలిచేద్దామని దారాల పోగులా...
ఒక చోట నింగి నుంచి మబ్బుల లేఖపయిన రాసిన ప్రేమ లేఖ ...
ఎవరికివ్వాలో మర్చిపోయి కరిగి నీరయిపోయినట్టుగా ...
మత్తుగా  ఒలికిపోయి గమ్మత్తుగా  తడిపి పోయి 
చివరాఖరికి వెలిసిపోయింది