Friday, August 30, 2013

లచ్చి నా లచ్చి గయ్యాళి లచ్చి

గయ్యాళి నీ చూపులకు దడిసి గుండె గుబ గుబామని కొట్టుకున్నది   
పిసినారి నీ నడుము చూసి కనుపాప రెప్పల్లో చూపు దాచుకున్నది 
గడుసు నవ్వుల వయ్యారి,  
చందమామ నీ పెదవుల వంపుల్లో పొద్దుకి పోనాది 
చీకటి నీ జడల కొరడా ఝళిపించావు నా ఉనికి నన్నొదిలి నీ వైపు మరలిపోనాది 
ఘల్లు మని మోగేది నీ కాలి అందె కాదె లచ్చి నా గుండె గొల్లుమని మొత్తుకున్నాది 
 గల గలాడే నీ చేతి గాజుల సవ్వడి  నీ కాసే నా చూపు తిప్పితున్నాది 
వింటి నారి కి మల్లె ఉన్న జంట కనుబొమల మధ్య ఎర్రటి  సూరీడు 
ఒంటి గవ్వకి మల్లే ఉన్న సంపెంగ ముక్కు , ముక్కెర లా తళుక్కుమన్నది 
ఎర్ర రాయి కాదే లచ్చి ఇంకెవ్వరో నిన్ను చూసి ఆశ పడతారేమో నని
 నా కంట కారి ఎర్రబడిన నా కన్నీటి సుక్క  
నిదర రానీకుండా మత్తులో ముంచి తేలానీవు 
ఏమీ సేస్తే నాకు శాంతమవుతాది !!??!!
 ఏమి ఇస్తే నీకు ఇసిదమవుతాది  !!??!!
ఈ బాద ఈ దివులు తరిగిపోతాది  !!??!!
లచ్చి నా లచ్చి గయ్యాళి లచ్చి ..

అమ్మ

ఎవరో అడిగారు 
వాళ్ళంటే నీకు ఇష్టం కదూ 
లేదు ప్రాణం అన్నది అమ్మ
అందుకే తొమ్మిది నెలలు కడుపులో పెంచుతాను 
జీవితాంతం గుండెల్లో ఉంచుతాను 
అప్పుడెమో తెలీక, చోటు  చాలక కాళ్ళతో తన్నుతారు
తరువాత వాళ్ళ జీవితాల్లో చోటు నివ్వలేక గుండెల్లో తన్నుతారు 
అయినా సరే 
వాళ్ళంటే నాకు ప్రాణం 
అన్నది అమ్మ 

Wednesday, April 24, 2013


సందె కెంజాయ రంగు పులుముకున్న చెంప కెంపులు 
నీ వేలి కొసల స్పర్శకు నోచుకోక మరింతగా వెచ్చని ఆవిరులు కక్కుతుంటాయి 
నల్లని మేఘాల కురులు నీ జాడ తెలియ మరింత చిక్కులు పడుతుంటాయి 
నీ అలికిడి వినలేని చెవులు నీ ఉనికిని కనగొన లేని కళ్ళు 
ఆశగా నీకై పరితపిస్తూ ఉంటాయి 
కలలు కన్నీరులా మారి కలవరము పెడుతుంటాయి 
జాలే లేని నీవు జలపతాల హోరులా మారి 
గుండెని త్వర త్వరగ పదమని తొందర పెడుతుంటావు 
నీ దరికి చేర్చలేని కాళ్ళు 
తడ బడి తీరం చేరలేని కెరటాల లాగ 
ఒకే చోటులో ముడివడి పోతాయి
ఆగలేని మనసు నా నుంచి విడి వడి నిన్ను చేరుకుంటుంది 
మనసే లేని నేను నిన్ను మరచి పోనూ లేను 
విరహాల వేడి కి తట్టుకోనూలేనూ
చల్లని కౌగిలినిమ్మని వేడుకోనూలేను  
అసహాయాల ఆవేదనలో నన్ను పడవేసినా 
ఆదుకొమ్మని నన్ను చేరుకొమ్మని నిన్ను అడిగి 
చులకన కానూ లేను  
నిన్నొదిలి సాగిపోనూ లేను 

Friday, October 19, 2012

నా చెలి


తుళ్ళింతలూ కవ్వింతలూ కూర్చి కధానాయికలా చెలి సాగిపోతూ ఉంటుంది .
విరహాల దారిలో ఒంటరి బాటసారిలా దిక్కు తెలియక తికమకలు పడతాను .
కులుకుల హొయలు తో వనకన్యలా చెలి మెరిసిపోతుంది 
ఉరుముల మెరుపులా తలపులకు తట్టుకోలేక నన్ను నేను మరచిపోతుంటాను.
నవ్వుల కేరింతల సుడులలో తిప్పి నదిలా చెలి తరలిపోతూ ఉంటుంది. 
వేదనల, రోదనల వేగాలలో ఊపిరి తిరగక  ఉక్కిరి బిక్కిరి అవుతాను .
కొంటె కనులతో ఎన లేని ఊసులు చెప్పేసి నా చెలి నన్నొదిలేసి పోతుంది .
నిద్ర లేని రాతిరిలో కలలకు సైతం నోచుకోని నేను అల్లడి పోతాను 
మరవమూ మల్లెపూలు తన జ్ఞాపకాలు జీవితాంతం 
నన్ను వెంటాడుతూ ..
వేటాడుతూ ..

Thursday, October 4, 2012

ఎవరూ!!??!!


తుళ్ళి తుళ్ళి పాడే నా గుండె కు 
గుస గుసలు పంచినది ఎవరూ    
చక చకా వేగాన సాగే నా ఆలోచనలకు 
వలపు కళ్ళాలు వేసినదెవరూ
వేదన రోదన తెలియని నా మనసుకు
ప్రియ విరహ రాగాల కేరింతలు నేర్పిన దెవరూ 
పలకటమే తెలియని నా కనులకు
తీపి బాణాలను గుప్పినదెవరూ
మౌనాన్ని ఎరిగిన నా పెదవుల కు 
నవ్వుల మణి హారాల సవ్వడిని అలకరించినది ఎవరూ 
తానెవరూ ... నాకే తెలియని నన్ను , 
నాకు పరిచయం చేసినది ఎవరూ 

Friday, September 14, 2012

వెన్నెల నావలో మల్లెల ప్రయాణం

కొంటె నవ్వుల కదంబ మాలలు అల్లి నువ్వు నా చుట్టూ వలపుల వల నల్లేస్తావు

కనురెప్పల మాటున కలల దుప్పటి కప్పి విరహాల చిచ్చు రేపి నిద్దుర రద్దు చేస్తావు

చూపుల బాణాలు ఎక్కు పెట్టి నా వెర్రి గుండె లో తొందర అలజడి రెట్టిస్తావు

నీ తలపుల సుడులలో నా మనసు ముంచేసి చిందర వందర చేసేస్తావు

మాయల మాంత్రికుడల్లే నువ్వు అనుక్షణం నీ అలోచలనలతో నన్ను ముంచేస్తావు

విసురుగా వీచే గాలి .. కొసరుతూ వెలిగే వెన్నెలా ..

సన్నగా నవ్వుతూ మురిపించే మల్లె పొదా.. నీతో చేరి

నన్ను ప్రతి క్షణం నీ వైపుకు నడిపిస్తాయి

ఊరించి నన్ను ఉడికిస్తావో

విరహాల ఊయలలో గిర గిరా తిప్పి వేసిరేస్తావో

పోనీలే పాపమని నన్ను నీ నుంచి రక్షిస్తావో ..

దరిచేర్చి నన్ను నీ కౌగిలితో కరుణిస్తావో !!?!!

ఆశలనీ ఊసులనీ ముడివేసి

నీ కోసం మౌనాల వాకిలిలో

ఎదురు చూస్తూ నిలుచున్నాను సుమా

వేగాన రావో యి చల్లని నీడా.. నా వలపుల రేడా ..

Wednesday, September 12, 2012

చినుకు - చిరుగాలి - నీ జ్ఞాపకం

చినుకు చిటికెల సవరింతలకు మట్టి పూల చెమరింతలు

చిరుగాలి చక్కిలింతలకు చిగురాకుల సిగ్గుల మొగ్గలు

ఎగిరి దూకేటి వేగాలకు సెలయేటి గల గలలు

నీ తలపుల తెమ్మెరల తాకిడికి ఊపిరి వెచ్చదనాల నీరాజనాలు

నీ అడుగుల సవ్వడులకు గుండె గుబ గుబల తియ్యందనాలు

నీ చూపుల బాణాలకు గాయపడి ఎర్ర బడ్డ చెక్కిళ్ళు

ఏ ఒక్క నిమిషమూ నన్నొదలని

జాలే లేని నీ జ్ఞాపకాల మంటలకు విరహాల వీవెనలు

ఆవిరయిపోని నా ఆశల చందనాలు