Wednesday, September 17, 2008


మనసుల భావాలున్నా
కనులకు కలలున్నా
నిద్ర పోతున్న నేస్తం
చుట్టూరా చీకటి ఉన్నా
నా చిరునవ్వుల జ్యోతిని వెలిగిస్తాను.
మౌనంలో నువ్వు మునిగిపోతున్నావు
నేను నా మాటల తీరానికి చేరుస్తాను.
వస్తావా నాతో
తుమ్మెద రెక్కల విమానమెక్కి
పూవుల పుంతలు వెతుక్కుందాం.
తడి ఇసుకలో పాదాల ముద్రలేసుకుంటూ
గువ్వ రాళ్ళ జాతి వజ్రాలేరుకుందాం.
సెలయేరుల గమ్మత్తు గమకాల సరిగమలు నేర్చుకుందాం.
ఒక్కసారి మళ్ళీ పసితనాల వీధులలోకి వెళ్లి
అల్లరి చేష్టల అలల జ్ఞాపకాలు నెమరేసుకుందాం ...


Friday, September 5, 2008

ఆ తీరాన నువ్వున్నా


నా మమతల అనురాగాలుకట్టి మబ్బులతో కబురంపాను ..
నీవున్న చోట వర్షించాయా !
నా మురిపాల విన్నపాలన్నీ గువ్వమ్మలకి అందించాను ..
నీకు కువ కువల కబురులు అందించాయా !
నా పంటి బిగువుల చిట్టి పొట్టి అలుకలు సూర్యునితో వివరించాను ..
తొలి పొద్దు నులివెచ్చని కిరణాలు నీపై ప్రసరించాడా !
నా రహస్యాల విలాసాలన్నీ చిరుగాలిలో కలిపేశాను ..
హోరున నిన్ను కమ్ముకున్నాయా!
నా ఉడుకుమోతు తనాల కన్నీళ్ళని చినుకులలో వంపేసాను ..
జోరున నీపై వర్షించాయా !
నా నవ్వుల సౌరభాలన్నీ ప్రతి మొగ్గలోను పొట్లం కట్టి పంపించాను ..
నీవున్న చోట విచ్చుకుని వినిపించాయా !
రాసి పంపలేని వివరాలన్నీ తుషారాలలో నింపెసాను ..
ఆకులపై లేఖలు రాసి నీకు అందించాయా !
వేయి కన్నులతో నీకై ఎదురుచూస్తున్నానని చుక్కమ్మలకు చెప్పేసాను ..
నీకు మినుకు మినుకు దారులు చుపించాయా!
ఆ తీరాన నువ్వున్నా
ప్రతి నిమిషం నీకై తపిస్తున్నా !!



తొలకరి జల్లు


ఆకాశం నుండి రాలాయి మంచి ముత్యాలు ...
పుడమితల్లి మెడలో హారంగా ;
రైతన్నల గుండెల్లో పసిడి వరంగా,
రాబోయే మొలకలకు ఆహ్వానంగా,
ఎన్నో ముత్యాల సిరులు !
ఎటు చుసిన ఆనందమే
ఎటు చూసినా సంతోషమే
ఏదో తెలియని హాయి
ఇన్ని రత్నాలు ఒలికించి మురిపాలు కురిపించి
మరెన్నో బతుకులను పండించగలననే కామోసు !
ఆకాశానికి అంత బడాయి!!

ముసలి దాన్నా అదెలాగూ


తొలి కిరణాలు ఆర్తిగా నన్ను తడిమే వరకు ..


జోరున చందురుడు నాపై వెన్నెల వాన కురిపించేంతవరకు ..


గాలి కెరటాలు నాపై విసురుగా దుకేవరకు ..


నా కొప్పున మల్లెలు గుప్పున నవ్వేవరకు ..


నా వేలి కొసల ఆజ్ఞలు సాగేవరకు ..


నా కాలి మువ్వలు ఝల్లుమని మ్రోగేవరకు ..


నా నులి వెచ్చని కోపాలతనిలో పెను సెగలెగసే వరకు ..


నా గాజులతని చెవిలో రహస్యాలు చెప్పేవరకు ..


నా మాటల మురిపాలతన్ని అలరించేవరకు ..


అలసిన అతని మనసుకు నేనోదార్పయ్యేవరకు ..


నేను నెరజాణనే !


నా వసంతుని కొలిచే వన కన్యనే !


మరి , ముసలిదన్నయ్యనా అదెలాగూ !!