ప్రేమ - పరవశము
మనసుని నీ చెంగుకి ముడి వేసి
నా సంతోషాలని నీ మంజీరాలుగా మార్చి
నా కంటి వెలుగులకి మసి పూసి నీ కంటికి కాటుక పెట్టి
కులుకుతూ నువ్వెదురు పడితే
నేనెవ్వరో ఏం చేస్తున్నానో మరచిపోతానెందుచేత
నువ్వున్న క్షణాలన్నీ నా జీవితంలోంచి జారిపోయి
నా ఆలోచనలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి ఏమిటో
నా గుండె గుడిలో నీ ఉనికి ఉలితో నీ శిల్పాన్ని మలుకుంటూ
నా జ్ఞాపకాల తెరపై నవ్వుల కుంచెతో నీ బొమ్మ వేసుకుంటున్నావు
ఊపిరి బిగిసి గుండె సవ్వడి పెరిగి
సంతోషాల ఒరవడిలో సుడులు తిరిగి
నీలో మునిగిపోయి మరి పైకి తేలనే లేనోమో
మల్లెల దాడి వెన్నెల వేడి
విరహాల చెరసాలలో మగ్గిపోతున్నా
కాసంత దయ చుపించవూ
నేనంటూ ఎక్కడున్నానో వెతికి పట్టుకునే దారి చూపించవూ