Monday, July 2, 2012

ప్రేమ - పరవశము 


మనసుని నీ చెంగుకి ముడి వేసి 
నా సంతోషాలని నీ మంజీరాలుగా మార్చి
నా కంటి వెలుగులకి మసి పూసి నీ కంటికి కాటుక పెట్టి 
కులుకుతూ నువ్వెదురు పడితే 
నేనెవ్వరో ఏం చేస్తున్నానో మరచిపోతానెందుచేత
నువ్వున్న క్షణాలన్నీ నా జీవితంలోంచి జారిపోయి 
నా ఆలోచనలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి ఏమిటో 
నా గుండె గుడిలో నీ ఉనికి ఉలితో నీ శిల్పాన్ని మలుకుంటూ 

నా జ్ఞాపకాల తెరపై నవ్వుల కుంచెతో నీ బొమ్మ వేసుకుంటున్నావు

ఊపిరి బిగిసి గుండె సవ్వడి పెరిగి 
సంతోషాల ఒరవడిలో సుడులు తిరిగి 
నీలో మునిగిపోయి మరి పైకి తేలనే లేనోమో 
మల్లెల దాడి వెన్నెల వేడి 

విరహాల చెరసాలలో మగ్గిపోతున్నా 
కాసంత దయ చుపించవూ 

నేనంటూ ఎక్కడున్నానో వెతికి పట్టుకునే దారి చూపించవూ 

Wednesday, February 8, 2012

ప్రియమయిన ఓ లేఖ

చేప కళ్ళ మరదలు పిల్లకి ,

ఇంకెలా పిలవమంటావు మరి .. అదిగో ముక్కు ఎర్రబడిందే  మీనాక్షి అంటే అదే మరి .. నేను ఎలా ఉన్నానో రాసే ముందు .. నువ్వు నా జీవితంలోకి రాక ముందు ఎలా ఉన్నానో వచ్చాక ఎలా ఉన్నానో చెప్తే బాగుంటుందేమో ..నీ భాషలో చెప్పాలంటే రాచ్చిప్పలా ఉండే వాణ్ణి ఆల్చిప్పల మారాను నీ లాంటి ముత్యాన్ని పొదుముకోవద్దూ ??!? మరీ!!  .. నీలా తమాషాగా, సరదాగా కొంటెగా మాట్లాడడం అందరికీ రాదు సుమా, అలా వచ్చిన కూడా అందరికి అలా మాట్టాడ్డం నప్పదు కూడాను .. అక్క తో ఏమని చెప్పావు ?? నేనంటే తనకి ఏ భావం ఉందో తెలీకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా అన్నిటికీ ఒకటే ఎక్ష్ ప్రెషన్ ఇచ్చేవాడు నాకు వద్దు వదినా అనా !!??!! ఏమని చెప్పమంటావు అసలు !!?!! ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జలపాతం లా సాగిపోయే నీకు అవతలి వాడి గోడు వినేంత ఓపిక ఉంది అంటావా ? జలపాతానికి నిశ్చలత కలిగించేది నాలాంటి రాళ్ళే నోయి.. లేదంటే అవి పయినుంచి కిందకి దూకి ఒక దారిలో సాగే దెప్పుడు ?? 

ఏ ఇష్టం లేకపోతేనే నువ్వు నాకు అన్ని పనులూ చేసావుటోయి ? నీ లా అలా గల గలాని మోగక పోయినా నాకు అన్ని భావాలకు అర్థాలు తెలుసు సుమా.. ఎలాగని అంటావా ? అంతంత కళ్ళేసుకుని ఏదోలా ఎందుకు చూస్తావుటా నాకేసి ? నా కిష్టమని .. పాయసం చేసి వేడి గా గిన్నెలో పోసి తినమని నా ప్రాణం తినలేదూ నువ్వు ? సరే తిండి మాట అటుంచు .. మా ఆఫీసు లో పని చేసే అమ్మాయిల గురించి అమ్మతో చెబుతుంటే తల ఎగరేసుకుంటూ ఆ గది లో నుంచి వెళ్లి పోయినావెందుకుటా.. నీ ఉడుకుమోత్తనం చూసి ఎంత కులుక్కున్నానో నీకు తెలుసునా ? పండుగ పేరు చెప్పి (సన్నటి నడుము కనిపించేలా) చీరను కట్టి నా ముందే పదహారు సార్లు తిరగినదీ ఎవరంటావూ ..

చూడు అమ్మాయి!
ఇలా  నువ్వు నాకోసం చేసినవి చెప్పుకుంటూ  పొతే పెద్ద భారతమే అవుతుంది గాని ..నువ్వంటే నాకిష్టమని మాటల్లో చెప్పలంటావా ?? ఎలా చెపితే "ఇంతని" నీ మీద నా ఇష్టానికి ఒక పరిమితి ఏర్పడదూ !?...గబుక్కున నువ్వు విన్నావనుకో.. అంతేనా అని తోసి పారేస్తావు ..  అంటే నువ్వంటే నాకు ఎంతిష్టమో నాకే తెలీదు మరి .. ఆనక నా మీద అలుకలు సాగిద్దువు గాని .. మా చిలకకు మల్లే పెళ్ళికి ఒప్పేసుకోమ్మ.. ఆ తరువాత ఒద్దన్న సరే నీ మీద ఎంతిష్టమో ప్రతీ రోజు నీకు చెబుతూ ఉంటాగా.. అసలు వద్దన్నా సరే ఎత్తుకు పోయి మరీ పెళ్లి చేసుకో గలను నా పేరు తెలుసుగా ఆఖరున చెప్పలేదనద్దు  మరి చూసుకో .. అమ్మమ్మ వాళ్ళింటిలో చక్కటి పందిరేసి ఈ బావను పెళ్ళా డతావో లేక ఎత్తుకుపోయి ఈ సిటీ కి తీసుకొచ్చి నువ్వనే ప్లాస్టిక్ పెళ్లి కి ( అరిటాకులు వేస్తేనే మంచి పెళ్లి.. లేదంటే ప్లాస్టిక్ గ్లాసులు , ప్లాస్టిక్ పల్లాలు అంటూ ఎద్దేవా చేసావుట) సిద్ద పడతావో మరి ..

నీ 
వంశీ కృష్ణ 

Thursday, December 22, 2011

ఎవరు గెలుస్తారంటావు ?


నీ  నవ్వు మువ్వలా మోగుతుంటే 
గుండె గడియారం ఝల్లుమంది  
నీ మాట పాటయ్యి మురళిలా సాగుతుంటే 
విన్న హృదయం ఘల్లుమంది 
మనసు మల్లెల నావయింది 
ప్రేమ యేరువాకయింది 
ఆ తేనెల తుంపరలో 
మునకేసిన ప్రతి సారి 
జ్ఞాపకం పచ్చ బొట్టులా 
తేలిన ప్రతి సారి 
విరహం కారు చిచ్చులా
రెండూ సెగలు  రగిలించేవే
నీ ముద్రలు మిగిలించేవే 
రగిలి పొగిలి ఏడుస్తానో 
హరివిల్లయి విరబూస్తానో
ఎద సవ్వడిని ఆపలేను
నాలో వెల్లువనూ ఆపలేను
నేనుగా మిగలలేను
నువ్వుగా మారనూలేను
ఈ వలపు పందెంలో 
ఎవరు గెలుస్తారంటావు ?
నా నువ్వా??
లేక నీ నేనా ??

Wednesday, December 14, 2011

ఓ ప్రేమా


నల్లని మేఘమై నువ్వు కమ్మేస్తావు
జడివానలో తడిపెస్తావు 
పువ్వులా పులకిస్తావు 
నవ్వులా విరబూస్తావు 
వెన్నెలై  తళుకులు ఒలికిస్తావు 
సెలయేరై ప్రవహిస్తావు 
చిరుగాలి లా చుట్టేస్తావు 
నెల వంకలో .. నా భుజం ఒంపులో..
నా ఊపిరిలో వేణువులా
నా గుండెలో ప్రతిధ్వనిలా 
నే చూసే ప్రతి దిక్కులో
నే సాగే ప్రతి దారిలో
నా ప్రాణమా !! ఓ ప్రేమా!!
ఒక జ్ఞాపకమై నువ్వు ఎదురొస్తావు ..

Tuesday, November 15, 2011

వేకువ వరద

పసిడి బుగ్గల పయిన కెంజాయ రంగులో ఆకాశం కెంపుల మాలలా మెరుస్తుంది 
బద్ధకంగా వళ్ళు విరిచుకుంటూ పిట్ట ప్రియురాళ్ళు ..
కొమ్మ  బాహువుల్లోంచి సిగ్గుల పరదాలు తీసి హటాత్తుగా పయికెగురుతాయి .. 
విడ లేక విడిపోతూ ..గుస గుసల కువ కువలతో
పాల కోసం పరుగెత్తే తువ్వాయిల్లా.. 
వెచ్చని సూర్య కిరణాలు పుడమి తల్లి ముంగిట పారట్లాడుతుంటాయి  ...
చిగురు చిగురు నీ తడిమి వలపు కెరటాలై ముంచి పువ్వుల నవ్వుల్నీ విరగ బూయిస్తాయి.. 
నేను ముందంటే .. నేను ముందంటూ తోసుకోచ్చే ప్రతీ కిరణమూ.. 
ఒక్కో పిడిబాకై నిదుర  కన్నుల్లో పొడుస్తూ ..
అమ్మ చెరగులో దాగున్న ప్రతీ ప్రాణినీ లే లెమ్మంటూ ఉదయ రాగాలు ఆలపిస్తాయి.
కొంటె సూరీడు చుక్క పొద్దుల చీకటి చీల్చి పుట్టుకొస్తాడు 
రోజుకో కొత్త మొదలుతో 
మత్తు కౌగిళ్ళు వీడిన కళ్ళు రెండు పత్తి కాయలై విచ్చుకుంటాయి ..
చీకటి మౌనాన్ని విడిచి భూమి వెలుగు చీరను చుట్టుకుంటుంది 
వేకువ వరదలా వచ్చి లోకాన్ని అల్లుకుంటుంది ..

Friday, September 2, 2011

ఆపవో యి నీ కనికట్టు మహిమ

గుట్టు విప్పి చెప్పలేని కొంటె భావాలనీ 
 కనికట్టు చేసే నీ వింత సందడులనీ 
కనురెప్పల దుప్పటి కప్పి బజ్జో పెడతానా ??
అవి కల ల వాకిటి లో మెలిక ముగ్గుల మల్లె 
తిక మక ల చక్కిలిగిలి పెట్టిస్తాయి  
లేత చివురాకుల బుగ్గల్లో పొడిచి 
మంకెన పూలయ్యి పోతాయి ..
పెదవి జారనీకుండా పంట నొక్కి పెడతానా ??
ఉప్పు జలపాతాలయ్యి కను జారిపోతాయి ..
జారినాయనుకొని నిట్టుర్పు విడిచేలోగా..
గుండె మీద ఇంకిపోయి గట్టి రాయికి మల్లె 
బిర్ర బిగిసుకు పోతాయి.. 
ఎం చెయ్యాలో తెలీక దిగులయ్యి పోతానా ??
ఒక్క చూపు విసిరి హాయి కలిగిస్తావు 
అబ్బో ... నా లోన నువ్వు సరిగమల ప్రియరాగాలు పలికిస్తావు ..
ఎన్నడాగెనో కదా నీ కనికట్టు మహిమ 

Thursday, May 5, 2011

మరో సారి మన్నించ వూ ?

ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది
అలసిపోయిన నా కనులకు జోలలు పాడే నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది
నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది  
ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది 
నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది 
అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి  ఆవిరై పోవాలని ఉంది
కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల దాడికి విల విల్లాడి పోగలను కాని
మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ?
కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ?
వేడు కుంటున్నాను ప్రియా
నన్ను మరో సారి మన్నించ వూ ?