Thursday, October 4, 2012

ఎవరూ!!??!!


తుళ్ళి తుళ్ళి పాడే నా గుండె కు 
గుస గుసలు పంచినది ఎవరూ    
చక చకా వేగాన సాగే నా ఆలోచనలకు 
వలపు కళ్ళాలు వేసినదెవరూ
వేదన రోదన తెలియని నా మనసుకు
ప్రియ విరహ రాగాల కేరింతలు నేర్పిన దెవరూ 
పలకటమే తెలియని నా కనులకు
తీపి బాణాలను గుప్పినదెవరూ
మౌనాన్ని ఎరిగిన నా పెదవుల కు 
నవ్వుల మణి హారాల సవ్వడిని అలకరించినది ఎవరూ 
తానెవరూ ... నాకే తెలియని నన్ను , 
నాకు పరిచయం చేసినది ఎవరూ 

Friday, September 14, 2012

వెన్నెల నావలో మల్లెల ప్రయాణం

కొంటె నవ్వుల కదంబ మాలలు అల్లి నువ్వు నా చుట్టూ వలపుల వల నల్లేస్తావు

కనురెప్పల మాటున కలల దుప్పటి కప్పి విరహాల చిచ్చు రేపి నిద్దుర రద్దు చేస్తావు

చూపుల బాణాలు ఎక్కు పెట్టి నా వెర్రి గుండె లో తొందర అలజడి రెట్టిస్తావు

నీ తలపుల సుడులలో నా మనసు ముంచేసి చిందర వందర చేసేస్తావు

మాయల మాంత్రికుడల్లే నువ్వు అనుక్షణం నీ అలోచలనలతో నన్ను ముంచేస్తావు

విసురుగా వీచే గాలి .. కొసరుతూ వెలిగే వెన్నెలా ..

సన్నగా నవ్వుతూ మురిపించే మల్లె పొదా.. నీతో చేరి

నన్ను ప్రతి క్షణం నీ వైపుకు నడిపిస్తాయి

ఊరించి నన్ను ఉడికిస్తావో

విరహాల ఊయలలో గిర గిరా తిప్పి వేసిరేస్తావో

పోనీలే పాపమని నన్ను నీ నుంచి రక్షిస్తావో ..

దరిచేర్చి నన్ను నీ కౌగిలితో కరుణిస్తావో !!?!!

ఆశలనీ ఊసులనీ ముడివేసి

నీ కోసం మౌనాల వాకిలిలో

ఎదురు చూస్తూ నిలుచున్నాను సుమా

వేగాన రావో యి చల్లని నీడా.. నా వలపుల రేడా ..

Wednesday, September 12, 2012

చినుకు - చిరుగాలి - నీ జ్ఞాపకం

చినుకు చిటికెల సవరింతలకు మట్టి పూల చెమరింతలు

చిరుగాలి చక్కిలింతలకు చిగురాకుల సిగ్గుల మొగ్గలు

ఎగిరి దూకేటి వేగాలకు సెలయేటి గల గలలు

నీ తలపుల తెమ్మెరల తాకిడికి ఊపిరి వెచ్చదనాల నీరాజనాలు

నీ అడుగుల సవ్వడులకు గుండె గుబ గుబల తియ్యందనాలు

నీ చూపుల బాణాలకు గాయపడి ఎర్ర బడ్డ చెక్కిళ్ళు

ఏ ఒక్క నిమిషమూ నన్నొదలని

జాలే లేని నీ జ్ఞాపకాల మంటలకు విరహాల వీవెనలు

ఆవిరయిపోని నా ఆశల చందనాలు

Monday, July 2, 2012

ప్రేమ - పరవశము 


మనసుని నీ చెంగుకి ముడి వేసి 
నా సంతోషాలని నీ మంజీరాలుగా మార్చి
నా కంటి వెలుగులకి మసి పూసి నీ కంటికి కాటుక పెట్టి 
కులుకుతూ నువ్వెదురు పడితే 
నేనెవ్వరో ఏం చేస్తున్నానో మరచిపోతానెందుచేత
నువ్వున్న క్షణాలన్నీ నా జీవితంలోంచి జారిపోయి 
నా ఆలోచనలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి ఏమిటో 
నా గుండె గుడిలో నీ ఉనికి ఉలితో నీ శిల్పాన్ని మలుకుంటూ 

నా జ్ఞాపకాల తెరపై నవ్వుల కుంచెతో నీ బొమ్మ వేసుకుంటున్నావు

ఊపిరి బిగిసి గుండె సవ్వడి పెరిగి 
సంతోషాల ఒరవడిలో సుడులు తిరిగి 
నీలో మునిగిపోయి మరి పైకి తేలనే లేనోమో 
మల్లెల దాడి వెన్నెల వేడి 

విరహాల చెరసాలలో మగ్గిపోతున్నా 
కాసంత దయ చుపించవూ 

నేనంటూ ఎక్కడున్నానో వెతికి పట్టుకునే దారి చూపించవూ 

Wednesday, February 8, 2012

ప్రియమయిన ఓ లేఖ

చేప కళ్ళ మరదలు పిల్లకి ,

ఇంకెలా పిలవమంటావు మరి .. అదిగో ముక్కు ఎర్రబడిందే  మీనాక్షి అంటే అదే మరి .. నేను ఎలా ఉన్నానో రాసే ముందు .. నువ్వు నా జీవితంలోకి రాక ముందు ఎలా ఉన్నానో వచ్చాక ఎలా ఉన్నానో చెప్తే బాగుంటుందేమో ..నీ భాషలో చెప్పాలంటే రాచ్చిప్పలా ఉండే వాణ్ణి ఆల్చిప్పల మారాను నీ లాంటి ముత్యాన్ని పొదుముకోవద్దూ ??!? మరీ!!  .. నీలా తమాషాగా, సరదాగా కొంటెగా మాట్లాడడం అందరికీ రాదు సుమా, అలా వచ్చిన కూడా అందరికి అలా మాట్టాడ్డం నప్పదు కూడాను .. అక్క తో ఏమని చెప్పావు ?? నేనంటే తనకి ఏ భావం ఉందో తెలీకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా అన్నిటికీ ఒకటే ఎక్ష్ ప్రెషన్ ఇచ్చేవాడు నాకు వద్దు వదినా అనా !!??!! ఏమని చెప్పమంటావు అసలు !!?!! ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జలపాతం లా సాగిపోయే నీకు అవతలి వాడి గోడు వినేంత ఓపిక ఉంది అంటావా ? జలపాతానికి నిశ్చలత కలిగించేది నాలాంటి రాళ్ళే నోయి.. లేదంటే అవి పయినుంచి కిందకి దూకి ఒక దారిలో సాగే దెప్పుడు ?? 

ఏ ఇష్టం లేకపోతేనే నువ్వు నాకు అన్ని పనులూ చేసావుటోయి ? నీ లా అలా గల గలాని మోగక పోయినా నాకు అన్ని భావాలకు అర్థాలు తెలుసు సుమా.. ఎలాగని అంటావా ? అంతంత కళ్ళేసుకుని ఏదోలా ఎందుకు చూస్తావుటా నాకేసి ? నా కిష్టమని .. పాయసం చేసి వేడి గా గిన్నెలో పోసి తినమని నా ప్రాణం తినలేదూ నువ్వు ? సరే తిండి మాట అటుంచు .. మా ఆఫీసు లో పని చేసే అమ్మాయిల గురించి అమ్మతో చెబుతుంటే తల ఎగరేసుకుంటూ ఆ గది లో నుంచి వెళ్లి పోయినావెందుకుటా.. నీ ఉడుకుమోత్తనం చూసి ఎంత కులుక్కున్నానో నీకు తెలుసునా ? పండుగ పేరు చెప్పి (సన్నటి నడుము కనిపించేలా) చీరను కట్టి నా ముందే పదహారు సార్లు తిరగినదీ ఎవరంటావూ ..

చూడు అమ్మాయి!
ఇలా  నువ్వు నాకోసం చేసినవి చెప్పుకుంటూ  పొతే పెద్ద భారతమే అవుతుంది గాని ..నువ్వంటే నాకిష్టమని మాటల్లో చెప్పలంటావా ?? ఎలా చెపితే "ఇంతని" నీ మీద నా ఇష్టానికి ఒక పరిమితి ఏర్పడదూ !?...గబుక్కున నువ్వు విన్నావనుకో.. అంతేనా అని తోసి పారేస్తావు ..  అంటే నువ్వంటే నాకు ఎంతిష్టమో నాకే తెలీదు మరి .. ఆనక నా మీద అలుకలు సాగిద్దువు గాని .. మా చిలకకు మల్లే పెళ్ళికి ఒప్పేసుకోమ్మ.. ఆ తరువాత ఒద్దన్న సరే నీ మీద ఎంతిష్టమో ప్రతీ రోజు నీకు చెబుతూ ఉంటాగా.. అసలు వద్దన్నా సరే ఎత్తుకు పోయి మరీ పెళ్లి చేసుకో గలను నా పేరు తెలుసుగా ఆఖరున చెప్పలేదనద్దు  మరి చూసుకో .. అమ్మమ్మ వాళ్ళింటిలో చక్కటి పందిరేసి ఈ బావను పెళ్ళా డతావో లేక ఎత్తుకుపోయి ఈ సిటీ కి తీసుకొచ్చి నువ్వనే ప్లాస్టిక్ పెళ్లి కి ( అరిటాకులు వేస్తేనే మంచి పెళ్లి.. లేదంటే ప్లాస్టిక్ గ్లాసులు , ప్లాస్టిక్ పల్లాలు అంటూ ఎద్దేవా చేసావుట) సిద్ద పడతావో మరి ..

నీ 
వంశీ కృష్ణ 

Thursday, December 22, 2011

ఎవరు గెలుస్తారంటావు ?


నీ  నవ్వు మువ్వలా మోగుతుంటే 
గుండె గడియారం ఝల్లుమంది  
నీ మాట పాటయ్యి మురళిలా సాగుతుంటే 
విన్న హృదయం ఘల్లుమంది 
మనసు మల్లెల నావయింది 
ప్రేమ యేరువాకయింది 
ఆ తేనెల తుంపరలో 
మునకేసిన ప్రతి సారి 
జ్ఞాపకం పచ్చ బొట్టులా 
తేలిన ప్రతి సారి 
విరహం కారు చిచ్చులా
రెండూ సెగలు  రగిలించేవే
నీ ముద్రలు మిగిలించేవే 
రగిలి పొగిలి ఏడుస్తానో 
హరివిల్లయి విరబూస్తానో
ఎద సవ్వడిని ఆపలేను
నాలో వెల్లువనూ ఆపలేను
నేనుగా మిగలలేను
నువ్వుగా మారనూలేను
ఈ వలపు పందెంలో 
ఎవరు గెలుస్తారంటావు ?
నా నువ్వా??
లేక నీ నేనా ??

Wednesday, December 14, 2011

ఓ ప్రేమా


నల్లని మేఘమై నువ్వు కమ్మేస్తావు
జడివానలో తడిపెస్తావు 
పువ్వులా పులకిస్తావు 
నవ్వులా విరబూస్తావు 
వెన్నెలై  తళుకులు ఒలికిస్తావు 
సెలయేరై ప్రవహిస్తావు 
చిరుగాలి లా చుట్టేస్తావు 
నెల వంకలో .. నా భుజం ఒంపులో..
నా ఊపిరిలో వేణువులా
నా గుండెలో ప్రతిధ్వనిలా 
నే చూసే ప్రతి దిక్కులో
నే సాగే ప్రతి దారిలో
నా ప్రాణమా !! ఓ ప్రేమా!!
ఒక జ్ఞాపకమై నువ్వు ఎదురొస్తావు ..