Thursday, April 21, 2011

ఏమి చూపే అది చిత్రాల మారాణి

ఏమి చూపే అది చిత్రాల మారాణి

సూటిగా నీ చూపు నాటింది తుమ్మ ముల్లోలే

గుండె గుబ గుబ లాడి ప్రాణం విల విల్లాడి

ఒడ్డున పడ్డ చాపోలె పోర్లాను

పూసంత నవ్వితేనే పున్నములు పూస్తే

బంతి పువ్వులాగా యిరగబడి నవ్వితే

ఏమయ్యిపోవాల ఏడేడు లోకాలు ??

ఏమి చూపే అది చిత్రాల మారాణి

గోగు పుల రైక గుత్తు పూలా చీర గుత్తంగా నువ్వు కట్టి

గట్టు ఎమ్మడి గున గునా నడుత్త ఉంటే

రెండు కళ్ళు సాలవు నీ వయ్యారాల జిలుగును చూడంగా

గడ కర్రలగా నిట్రాట నై పోతి

ఆకుల్లో కొమ్మల్లో నడిసేటి దారుల్లో

ఎలిగేటి సూరీడు రేకల్లో

కడాకు వెంట నడిసేటి నా నీడ లో సైతం నిన్నే సూత్తున్నాను

ఏమి చూపే అది చిత్రాల మారాణి

కొప్పులో చామంతి దిక్కు తెలియక రాలిపోయే

దండ కడియాల నీకాళ్లు నడిచిన నేలంతా

కదలక మెదలక ఒక్కచోటే ఉండిపోయే

నాకేసి సూత్తా నవ్వు ఇసిరేసి పోయావు

రేయంత దిగులు పగలంతా సెగలు

ఏమి చూపే అది చిత్రాల మారాణి

చూపులోనా చురకత్తి బాణాలు

నడక లోన నవ్వేటి జలపాతాలు

కలువ పూల కళ్ళు కాటుక భరిణో లే  
    
నడుములో నెలవంక కరిగి జారి పోయే

ఏటి వడ్డున ఉన్న కోవెల్లో కోనేరల్లె  

ఒక చోట ఉండలేను నీదరికి చేరలేను

ఎంట పడి తరిమేటి నీ చూపునాపలేను 
ఏమి చూపే అది చిత్రాల మారాణి






Tuesday, April 19, 2011

తెలియనే లేదు నేనంతో నాలో నువ్వెంతో

నీరసించి పోతున్న నీ అడుగులను నిలకడ చేసేంతవరకు తెలియనేలేదు నా భుజాల బలమెంతో

నీ నడుము చుట్టూ తా బిగియక ముందు తెలియనే లేదు నా చేతుల పొడవెంతో

నీ వేళ్ళ సందుల్లో ముడిపడ్డ నా వేళ్ళ మధ్య ఖాళీ ఎంతో తెలియనే లేదు

నాజుగ్గా నీ తల వాల్పుకు నోచుకున్న నా చాతీ కొలత వివరమే లేదు

నీ చిలిపి రహస్యాలు వెచ్చని ఉపిరి శ్వాస ల మధ్య పంచుకునేంతవరకు తెలియనే లేదు వినికిడి వివరమెంతో

విడి జారి పోతున్న నిన్ను ఒడిసి పట్టేంతవరకు తెలియనే లేదు నా పట్టుదలల పంతమెంతో

గుట్టు చప్పుడు కాకుండా మ్రోగే నా గుండె లోని  ప్రేమా వేశమెంతో

తెలియనే లేదు నేనంతో నాలో నువ్వెంతో



Thursday, March 17, 2011

అల్లరి మావా

తుంటరి నా మావా తలపుల్లో మునిగి

తెప్ప రాక కోసం తిప్పలు పడతాంటే

కొంటె గాలి వచ్చి పయిట లాగేస్తాందే

ఏటి నీళ్ళ నడిగి బదులేమీ రాక

మొగము తిప్పుకొని తిక మకలు పడుతుంటే

వెన్నెల మారాజు వేడి మంటలతోటి వలపు సెగ రాజేసే

కదల లేని దండ కడియాల కాళ్ళు ముడివేసి కూర్చున్నా

రెప్పలార్ప లేని కళ్ళు సెగల నార్పలేక

చింతపడి కూర్చుంటే ...

మల్లెల దండ ముడవలేదని అలిగి అందాల నా కొప్పు అలిగి జారిపోయే ..

రాడేమి నా మురిపాల మావా

ఇంకా రాడేమి నా అల్లరి మావా ..

Tuesday, January 18, 2011

సిరిమువ్వల నా నువ్వు



సుమధుర భావాలను కనురెప్పల కుంచెలతో గుండెపై చిత్రిస్తావు
గుండె చప్పుడు లో ని గుబులును గుస గుసలుగా మర్చి నా చెవులకు వినిపిస్తావు  
చిరు నవ్వు ల చురకత్తి తో అనుక్షణం దాడి సాగిస్తావు 
వాడి నిట్టూర్పుల వేడి తో మంచులో సైతం సెగలు రగిలిస్తావు 
నీ కనుల  సెలయేటిలో పడిన ప్రతి సారి వేయి సార్లు జన్మిస్తాను 
నను దాటి నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తాను 

Wednesday, January 12, 2011

పదహారేళ్ళ ప్రాయం


లేత అరచేతిలో పెట్టిన గోరింటాకు 
బుగ్గల్లో పండే వైనం 
చిలిపి కళ్ళతో మనసులను 
గిల్లే పరువాల ప్రాయం 
తుళ్ళింతల కెరటాలు పైకెగసి పడే సందేహాల సంద్రం 
గోదారొడ్డున ఇసుక తిన్నెల్లో దొరికే 
గువ్వరాళ్ళ గందరగోళం 
అన్నీ తమకే తెలుసనే నడమంత్రపు సిరుల సైన్యం
వెన్నెల లో మెరిసి 
పాలల్లో తడసి 
మిణుగురులై ఎగసి 
చినుకులలో వెలిసి 
తేనెల్లో విరిసి 
తొలిపొద్దున కురిసే
మంచుబిందువులై నునులేత సూర్య కిరణాలకే
కరిగి నీరయిపోయి 
పదహారేళ్ళ ప్రాయం

Tuesday, December 7, 2010

నేనంటే నీకెందుకు ?


అందమయిన ప్రకృతి నీలో కలిసి ముందుకు సాగి పోతుంటుంది 
వసంతాల చివురులు తొడిగి మరి మరి మారాకులు వేస్తుంటుంది 
సువాసనల రాదారిలో ప్రతి పువ్వు పులకింతల నవ్వు రువ్వుతుంది 
చినుకుల కిత కితలకి మట్టి వయ్యారాల మొలకలు పొడుస్తుంటుంది
నీ చూపు తగిలినంత మేరా ఆకాశం వేవేల చుక్కల తివాచీ విప్పుకుంటుంది 
నీ స్పందన కి పులకించిన సెలయేరు గల గలా జల జలా నవ్వుతూ కింది కి జారిపోతుంది 
ఓ కను సైగ కి  నీ వెచ్చటి స్పర్శకి సైతం నోచుకోని 
నా కన్ను ఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది 
భగ భగ మని గుండె లావాలా గుబులవుతుంది 
నా ఒక్కదాని కోసం చిమ్మ చీకటి పరదాలు పరుస్తుంది 
నేను మాత్రం మంచులా బిగిసి ,
 కరిగి నీరై , ఆవిరై సమసిపోతాను