Wednesday, February 8, 2012

ప్రియమయిన ఓ లేఖ

చేప కళ్ళ మరదలు పిల్లకి ,

ఇంకెలా పిలవమంటావు మరి .. అదిగో ముక్కు ఎర్రబడిందే  మీనాక్షి అంటే అదే మరి .. నేను ఎలా ఉన్నానో రాసే ముందు .. నువ్వు నా జీవితంలోకి రాక ముందు ఎలా ఉన్నానో వచ్చాక ఎలా ఉన్నానో చెప్తే బాగుంటుందేమో ..నీ భాషలో చెప్పాలంటే రాచ్చిప్పలా ఉండే వాణ్ణి ఆల్చిప్పల మారాను నీ లాంటి ముత్యాన్ని పొదుముకోవద్దూ ??!? మరీ!!  .. నీలా తమాషాగా, సరదాగా కొంటెగా మాట్లాడడం అందరికీ రాదు సుమా, అలా వచ్చిన కూడా అందరికి అలా మాట్టాడ్డం నప్పదు కూడాను .. అక్క తో ఏమని చెప్పావు ?? నేనంటే తనకి ఏ భావం ఉందో తెలీకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా అన్నిటికీ ఒకటే ఎక్ష్ ప్రెషన్ ఇచ్చేవాడు నాకు వద్దు వదినా అనా !!??!! ఏమని చెప్పమంటావు అసలు !!?!! ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జలపాతం లా సాగిపోయే నీకు అవతలి వాడి గోడు వినేంత ఓపిక ఉంది అంటావా ? జలపాతానికి నిశ్చలత కలిగించేది నాలాంటి రాళ్ళే నోయి.. లేదంటే అవి పయినుంచి కిందకి దూకి ఒక దారిలో సాగే దెప్పుడు ?? 

ఏ ఇష్టం లేకపోతేనే నువ్వు నాకు అన్ని పనులూ చేసావుటోయి ? నీ లా అలా గల గలాని మోగక పోయినా నాకు అన్ని భావాలకు అర్థాలు తెలుసు సుమా.. ఎలాగని అంటావా ? అంతంత కళ్ళేసుకుని ఏదోలా ఎందుకు చూస్తావుటా నాకేసి ? నా కిష్టమని .. పాయసం చేసి వేడి గా గిన్నెలో పోసి తినమని నా ప్రాణం తినలేదూ నువ్వు ? సరే తిండి మాట అటుంచు .. మా ఆఫీసు లో పని చేసే అమ్మాయిల గురించి అమ్మతో చెబుతుంటే తల ఎగరేసుకుంటూ ఆ గది లో నుంచి వెళ్లి పోయినావెందుకుటా.. నీ ఉడుకుమోత్తనం చూసి ఎంత కులుక్కున్నానో నీకు తెలుసునా ? పండుగ పేరు చెప్పి (సన్నటి నడుము కనిపించేలా) చీరను కట్టి నా ముందే పదహారు సార్లు తిరగినదీ ఎవరంటావూ ..

చూడు అమ్మాయి!
ఇలా  నువ్వు నాకోసం చేసినవి చెప్పుకుంటూ  పొతే పెద్ద భారతమే అవుతుంది గాని ..నువ్వంటే నాకిష్టమని మాటల్లో చెప్పలంటావా ?? ఎలా చెపితే "ఇంతని" నీ మీద నా ఇష్టానికి ఒక పరిమితి ఏర్పడదూ !?...గబుక్కున నువ్వు విన్నావనుకో.. అంతేనా అని తోసి పారేస్తావు ..  అంటే నువ్వంటే నాకు ఎంతిష్టమో నాకే తెలీదు మరి .. ఆనక నా మీద అలుకలు సాగిద్దువు గాని .. మా చిలకకు మల్లే పెళ్ళికి ఒప్పేసుకోమ్మ.. ఆ తరువాత ఒద్దన్న సరే నీ మీద ఎంతిష్టమో ప్రతీ రోజు నీకు చెబుతూ ఉంటాగా.. అసలు వద్దన్నా సరే ఎత్తుకు పోయి మరీ పెళ్లి చేసుకో గలను నా పేరు తెలుసుగా ఆఖరున చెప్పలేదనద్దు  మరి చూసుకో .. అమ్మమ్మ వాళ్ళింటిలో చక్కటి పందిరేసి ఈ బావను పెళ్ళా డతావో లేక ఎత్తుకుపోయి ఈ సిటీ కి తీసుకొచ్చి నువ్వనే ప్లాస్టిక్ పెళ్లి కి ( అరిటాకులు వేస్తేనే మంచి పెళ్లి.. లేదంటే ప్లాస్టిక్ గ్లాసులు , ప్లాస్టిక్ పల్లాలు అంటూ ఎద్దేవా చేసావుట) సిద్ద పడతావో మరి ..

నీ 
వంశీ కృష్ణ